హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వద్దనీ, అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా డ్రైవర్లు పలు సూచనలు జారీ చేశారు. టీఎస్ ఆర్టీసీ ఎంతో కాలంగా భద్రతకు మారుపేరుగా నిలచిందనీ, జాతీయ స్థాయిలో అతి తక్కవ ప్రమాద రేటుతో అనేక అవార్డులు అందుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు. వర్షం కురుస్తున్నప్పడు వేగ నియంత్రణ పాటించాలనీ, మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఉపయోగించాలన్నారు.
ముందు వెళ్లే వాహనంతో సురక్షిత దూరాన్ని పాటిస్తూ దట్టమైన వర్షం ఉన్న చోట హారన్ వాడాలన్నారు. హెడ్ లైట్ లో బీమ్‌లో, ఫాగ్ లైట్లను తప్పనిసరిగా వాడాలనీ, వైపర్లను కండిషన్లో ఉంచుకోవాలని పేర్కొన్నారు. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా నడపాలనీ, నదులు, కల్వర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ దాటే ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేశారు. డ్యూటీకి బయలుదేరే ముందే వైపర్, హెడ్ లైట్ల పనితీరును పరిశీలించుకోవాలనీ, తెల్లవారుజామున సమీప బస్ స్టేషన్లలో ఆపుకుని నీళ్లతో ముఖం కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.
వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ రూట్లో వెళ్లరాదని సూచించారు. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును న్యూట్రల్ చేసి నడపరాదనీ, హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనీ, నగరంలో మ్యాన్‌హోల్స్, రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సాయంతో వాహనాన్ని నడపాలని బస్సుల్లో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలని స్పష్టం చేశారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దనీ, తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదని ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు.