హైదరాబాద్ – బీజేపీ మహాధర్నాకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు సోమవారం పచ్చజెండా ఊపింది. రేపు… మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు బీజేపీ అనుమతి కోరగా, పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ధర్నా చేసుకోవడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రేపు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు.
ధర్నా చౌక్ ప్రాంతంలో ఫ్లై ఓవర్ పనులు జరుగుతుండటం వల్ల అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే శాంతి భద్రతల సమస్య కూడా ఉందని వెల్లడించారు.. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలకు విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా? అడిగింది. ప్రభుత్వం కనీసం 5,000 మందికి కూడా భద్రత కల్పించకపోతే ఎలా? అని కూడా ప్రశ్నించింది. ఆ తర్వాత బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని పేర్కొంది. పోలీసులకు నిర్వహకులు సహకరించాలని సూచించింది.