ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గొదావరి అంతకంతకూ ఉదృతి పెరుగుతున్న తరుణంలో ఖమ్మం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. భద్రాచలంలో గొదావరి బ్రిడ్జిపై నుండి వరద ఉద్రుతినీ ఇవ్వాల (బుధవారం) ఆయన పరిశీలించారు. అనంతరం భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ లోని వరద ముంపు బాధితుల పునరావాస కేంద్రాలను పరిశీలించి వారికి ధైర్యం కల్పించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రజలకు ఎక్కడ, ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి. వరద ఉదృతి తీవ్రస్థాయిలో ఉంటే తక్షణ సహాయ చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ను ఏర్పాటు చేసింది. ITDA, ITCలో హెలిప్యాడ్ సిద్ధం చేశాం. ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు సహాయక చర్యల కోసం పోలీస్ యంత్రాంగంతో పాటు CRPF, NDRF సిబ్బంది అదనపు బలగాలతో సిద్ధంగా ఉన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు బయటకు రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలి. వరదల్లో సాహసకృత్యాలు చేయడం, చేపల వేటకు వెళ్లడం, అకారణంగా రోడ్లపైకి రావడం అంత మంచిది కాదు. గోదావరికి ఎగువ నుండి వస్తున్న భారీ వరదలు, వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలతో ప్రాజెక్టులన్ని జలమయం అయ్యాయి. దీంతో దిగువ ప్రాంతానికి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని గమనిస్తే భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులకు చేరే అవకాశం ఉంది. అందుకని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కి తెలియజేశాం. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను చెప్పాం. వరదలు పూర్తి స్ధాయిలో అదుపులోకి వచ్చే దాకా భద్రాచలంలో మకాం వేసి ఎప్పటికపుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం” అని మంత్రి పువ్వాడ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ , ITDA PO గౌతమ్, ఇరిగేషన్ CE శ్రీనివాస్ రెడ్డి, SE వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మి నారాయణ ఉన్నారు.