కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ సోకిన వ్యక్తిని హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని, శాంపిల్స్ సేకరించి పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కి పంపినట్టు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలెవరూ మంకీపాక్స్ గురించి ఆందోళన చెందవద్దని, మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కాగా, కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఇవ్వాల కనిపించాయి. దీంతో అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు.
ఈ వ్యక్తి జులై 6న కువైట్ నుంచి వచ్చాడనీ, 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లినట్టు డీహెచ్ తెలిపారు. దీంతో అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారని, అక్కడ్నుంచి 108లో అతన్ని ఫీవర్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసినట్టు తెలిపారు. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించినట్టు తెలిపారు. వాళ్లెవరికీ మంకీపాక్స్ లక్షణాలు లేవని, అయినా వారిని ఐసోలేట్ చేసినట్టు తెలిపారు.