ప్రభ న్యూస్, గుమ్మడిదల : పచ్చని అడవిలో డంపు యార్డును ఏర్పాటు చేసి ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేయవద్దు అంటూ గుమ్మడిదల రైతులు, నాయకులు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, జిల్లా పాలనాధికారి వల్లూరి క్రాంతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏర్పాటు చేసి వేల ఎకరాలను వారి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే డీఆర్డీఏ కూడా ఏర్పాటు అవ్వడంతో దాదాపు రెండు, మూడు గ్రామాలు కనుమరుగై పోయాయని తెలిపారు.
ప్రస్తుతం ఉన్నటువంటి కొద్దిపాటి భూములపై వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్న వారే ఉన్నారని, అలాంటి ప్రదేశంలో డంప్ యార్డును ఏర్పాటు చేస్తే కాస్త జీవనం కూడా లేకుండా పోతుందని మంత్రికి విన్నవించారు. ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకొని గుమ్మడిదల మండల రైతులకు సహకరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా పాలనాధికారి వల్లూరి క్రాంతి కిరణ్ ను కోరినట్లు వారు తెలిపారు.
ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రికి మండల ప్రజల వినతులను తప్పక తెలియపరుస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో తాజా మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్ హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి, సత్యనారాయణ, సూర్యనారాయణ, శంకర్ యాదగిరి, తదితరులు ఉన్నారు.