రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటేయడానికి ఎస్ ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్ ల వద్ద జనం క్యూ కట్టారని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతుందని వివరించారు. నాగార్జున సాగర్ గొడవపై రాజకీయ నేతలకు కీలక సూచన చేశారు. ఈ గొడవ విషయం పోలీసులకు వదిలివేయాలని, వాళ్లే చూసుకుంటారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన నేతలైనా సరే దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడవద్దని హెచ్చరించారు. కాగా, నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి టెన్షన్ నెలకొంది. దాదాపు 500 మంది ఏపీ పోలీసులు డ్యామ్ పైకి చేరుకుని 13వ నెంబర్ గేట్ వద్ద ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. అక్కడి వరకు తమ పరిధిలోకి వస్తుందంటూ డ్యామ్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. అక్కడున్న సీసీ కెమెరాలతో పాటు డ్యామ్ సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లను ధ్వంసం చేశారు. విషయం తెలిసి మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏపీ పోలీసులతో మాట్లాడారు. ముళ్ల కంచెను తీసేయాలని చెప్పినా ఏపీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో తన సిబ్బందితో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.