భారత్‌లో అత్యధికంగా వేతనాలు పొందేది తెలంగాణ ఉద్యోగులేనని అసెంబ్లీలో స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో తాను చెప్పానని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామన్న మాటను నిలబెట్టుకున్నాం అన్నారు. ‘‘మాకు మానవీయ దృక్పథం ఉన్నది. కాంగ్రెస్, మరెవరి పార్టీనో ఇవ్వలేదు. 30శాతం పీఆర్సీ ఉద్యోగులకు ఇస్తే.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30శాతం జీతాలు పెంచాం. దేశ చరిత్రలో ఇదే తొలిసారి పెంచడం. శాసనసభలో పని చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పెంచాం. ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడాం. తక్కువ సమయంలో పీఆర్సీ అపాయింట్ చేస్తాం. మా ఉద్యోగులు చమటోడుస్తున్నరు. మా ఇంజినీర్ల పుణ్యం ప్రాజెక్టుల్లో నీళ్లు కనబడుతున్నయ్. మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యంతో వనాలు పెరుగుతున్నయ్. వ్యవసాయ అధికారుల పుణ్యంతో కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది’’ అన్నారు.
దేశమే ఆశ్చర్యపోయేలా వేతనాలు..
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావం – సాధించిన ప్రగతిపై చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘కర్నాటకలో కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. అక్కడి సీఎం ప్రకటించారు. పైసలు లేవ్.. ఏం చేద్దాం.. ఎస్టీ, ఎస్టీఫండ్స్ డైవర్ట్ చేసి వాగ్ధానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి. చేయగలిగిందే చెప్పాలి. చెప్పింది చేయాలి ఈ పద్ధతి ఉండాలి. నాలుగు ఓట్ల కోసం ఇష్టం వచ్చింది చెప్పి.. అలవికాని హామీలు ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇచ్చే పెన్షన్ ఎంత ? రాజస్థాన్‌లో ఇచ్చేదెంతా?.. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.4వేలు పెన్షన్ ఇస్తరా? ప్రజలను అడిగితే చెప్పారు. చేత్తమంటున్నరు వస్తరా? అంటే యాళ్లకు లావడితే ఎట్ల అంటున్నరు. ఇంతకు ముందు అనుభవాలు ఉన్నాయి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
పెన్షన్లు ఎలా పెంచాలో అలా పెంచుతాం..
‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మేము కాంగ్రెస్ అంత గొప్పోళ్లం కాదు. మేము మాత్రం రూ.లక్ష వరకు చేస్తామని చెప్పాము. గుద్దుడు గుద్దితే మేం 80 సీట్లు గెలిచాం.. వాళ్లు 19 సీట్లు గెలిచారు. అలవికానివి చెబితే ఎవరూ నమ్మరు. ఏ విధంగా పెన్షన్ ఎలా పెంచాలో పెంచుతాం. ఒకటేసారి పెంచలేం. క్రమానుగతంగా తీసుకెళ్తాం. మా దగ్గర ఇంకా గంపెడున్నయ్. మా దగ్గర చాలా అస్త్రాలున్నాయ్. మా అమ్ములపొదిలో చాలా అస్త్రాలు ఉన్నయ్. రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేం. సంక్షేమాన్ని అమలు చేస్తున్నది మేము. రెండేళ్ల నుంచి రూ.2వేలు ఇస్తున్నాం. మొదట వెయ్యి ఆ తర్వాత రూ.2వేలు ఇచ్చాం. కల్యాణలక్ష్మిలో మొదట రూ.50వేలు.. ఆ తర్వాత రూ.లక్ష ఇచ్చాం. గొర్ల యూనిట్లకు సైతం రూ.1.75లక్షలకు పెంచాం. రైతుబంధు రూ.4వేలతో మొదలు పెట్టి.. రూ.5వేలకు పెంచాం. రాబోయే రోజుల్లో ఎంత దూరం పెంచగలుగుతమో అంత వరకు పెంచుతాం’ అని తెలిపారు.
ఆశ్చర్యపోయేలా పే స్కేల్..
‘‘అనేక రకాల రెగ్యులరేటరి అధికారులు, ఎక్సైజ్, ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నరు. కమర్షియల్ టాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది ? ఒకనాడు ఎంత నేడు ఎంత ? రిజిస్ట్రేషన్స్‌లో ఒకనాడు ఆదాయం ఎంత.. ఇవాళ ఎంత ? ఉద్యోగులు శ్రమతో డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి.. వాళ్ల సొమ్ములో వారికి వాటా ఇచ్చి.. ప్రజలతో పాటు కడుపునిండా అన్నం పెట్టుకుంటున్నాం. దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తాం. బ్రహ్మాండంగా జీతాలు పెంచుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు సమకూరిస్తే ఇస్తేం. ఉద్యోగులు మా పిల్లలే. రాష్ట్రం ధనికమైతే.. వాళ్లు ధనికులు కావాలి. వారికి నాలుగు రూపాయలు కావాలి. తక్కువ సమయంలోనే ఐఆర్ ఇచ్చి.. పీఆర్సీ అపాయింట్ చేస్తాం. రెకమెండేషన్‌ను బట్టి.. మరోసారి దివ్యంగా పెంచుతాం. ఇప్పటికే 70శాతం పెంచుకున్నాం. మళ్లీ మంచి పర్సంటేజీతో జీతాలు పెంచుతాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.