Saturday, November 23, 2024

TS | కాంగ్రెస్, బీజేపీ అబద్ధపు హామీలు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

అచ్చంపేట, ప్రభ న్యూస్ : నల్లమల మట్టి బిడ్డనైన నన్ను ఆశీర్వదించి బీఆర్‌‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాగర్ కర్నూల్ బీఆర్‌‌ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు 2500, ఉచిత విద్యుత్తు ఎక్కడని ప్రశ్నించారు.

ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వృద్ధులు, వితంతువులు , వికలాంగులకు, ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల నగదు తో పాటు తులం బంగారం ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లో విఫలము అయ్యారని ఆ ఆడపిల్లల ఉసురు తగులుతుందని అన్నారు. రైతులకు రైతుబంధు, రైతు రుణమాఫీ ఎక్కడని ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చెంపచెల్లుమనేలా ప్రజలు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి స్పష్టమైన తీర్పు ఇవ్వాలని కోరారు.

స్థానికేతరుడైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లురవి 1991 మరియు 1999 గెలుపొంది ఎలాంటి అభివృద్ధిని చేయకుండా మరల ఇప్పుడు అధికారం దాహంతో మీ ముందుకు వస్తున్నాడని గుర్తించాలని అన్నారు. ఆరు గ్యారంటీల అమలు ఎక్కడని నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్,బిజెపిలు ఇచ్చే అబద్దపు హామీలకు మళ్ళీ మోసపోవద్దన్న ఆయన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

అంతకుముందు నల్లమలలోనీ పవిత్ర పుణ్యక్షేత్రమైన మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్,  స్థానిక ప్రజాప్రతినిధులు, భారాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement