Friday, November 22, 2024

TS: అధైర్య పడకండి.. అండగా నేనున్నా.. పొలం బాటలో కేసీఆర్

ఇది కరువు కాదు.. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం
ఎండిన పంటల రైతాంగాన్ని ఆదుకోవాలి
న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తా
రేవంత్ సర్కార్ పై కేసీఆర్ అగ్రహం

ప్రభ న్యూస్, బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె చంద్రశేఖర రావు శుక్రవారం పొలంబాటలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా రోడ్డుమార్గంలో బయలుదేరిన కేసీఆర్ ఉదయం 11గంటలకు కరీంనగర్ జిల్లా ముదుంపూర్ గ్రామానికి చేరుకున్నారు. కరీంనగర్ కు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ కు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి కుమార్ తో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. కరీంనగర్ నుండి ముద్దంపూర్ వరకు కనివిని ఎరుగని కాన్వాయ్ తో కేసీఆర్ సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాల వద్దకు చేరుకున్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించారు. 11గంటలకు ముదుంపూర్ చేరుకున్న కేసీఆర్ సుమారు గంటన్నర వరకు ఎండిన వరి పంట తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి పంటతో పాటు భూగర్భ జలాలు అడుగంటిన వ్యవసాయ బావిని పరిసర ప్రాంతాలను నేరుగా పరిశీలించారు. పంటలకు సాగునీరు సకాలంలో అందడం లేదా ? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికి వచ్చే దశలో సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు తమ గోడును కేసీఆర్ కు విన్నవించారు. ఎండిన వరిగడ్డితో కేసీఆర్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు.

తమకు ఇప్పటివరకు పంట నష్ట పరిహారం కానీ, ఇతర ఆర్థిక సాయం కానీ అందలేదని పోయారు. తమను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని విన్నవించారు. తమకు రైతుబంధు ఇప్పటివరకు రాలేదని కేసీఆర్ కు విన్నవించారు. ఈ సందర్భంగా కేసీఆర్ రైతులతో మాట్లాడారు. రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు. వెంటనే సాగునీరు అందక పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు.. ఇదే పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నప్పటికీ రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌న్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయన్నారు. ఫలితంగా చేతికి వచ్చిన వరి పంట ఎండిపోవడం అనేది జరిగిందన్నారు. దిగాలు చెందుతున్న రైతన్నలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రైతులే దేశానికి వెన్నుముక అని, రైతాంగం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటికి కేసీఆర్ చేరుకుని మధ్యలో భోజనం చేశారు. కాసేపు విరామం తీసుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నాయకులతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు తీరును నాయకులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం బయలుదేరిన కేసీఆర్ కరీంనగర్ నుండి చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లికి చేరుకున్నారు. బోయిన్పల్లి మండలంలో ఎండిన వరి పొలాలను కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చొప్పదండి నియోజకవర్గం, రామడగు మండలం, వేదిర గ్రామంలో ఎండిన వరి కంకులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రైతులు అంద‌జేసిన‌ సందర్భంగా బస్సు దిగి రైతులతో మాట్లాడి రైతన్నలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం శబాష్ పల్లి వద్ద అడగంటిన భూగర్భ జాలాశయాన్ని పరిశీంచారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కళకళలాడిన మిడ్ మానేరు ఇలా బోసిపోవడం కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు. నేరుగా సిరిసిల్ల తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే లు సుంకే రవి శంకర్, వొదితెల సతీష్ బాబు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవిఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement