రాష్ట్రంలోని అడవులు, వన్యప్రాణులను సంరక్షించేందుకు యాంటీ పోచింగ్ యూనిట్లకు అనుబంధంగా డాగ్ స్క్వాడ్ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తోంది. వేట గాళ్ళు, కలప దొంగలను పసి గట్టడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు కీలకంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం కవ్వాల్ అభయారణ్యంలో డాగ్ స్క్వాడ్ పనిచేస్తున్నది. డాగ్‌స్క్వాడ్‌ను మరిన్ని అటవీ ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రయోగాత్మకంగా రెండు స్నిఫర్ డాగ్‌లను అమ్రాబాద్, కవ్వాల్ అభయా రణ్యంలో ఏర్పాటు చేయగా, వాటిలో అమ్రాబాద్‌లో ఉన్న ఒక కుక్క అనారోగ్యం కారణంగా చనిపోయింది. కవ్వాల్‌లో ఉన్న జర్మన్ షెపర్డ్ అనే స్నిఫర్ డాగ్ గడిచిన రెండేళ్ళలో 20 కేసులను చేధించేందుకు సహాయపడిందని అధికారులు తెలిపారు.
డాగ్ స్క్వాడ్ సమర్ధవంతంగా పనిచేసేందుకు సిబ్బందికి గ్వాలియర్‌లోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ (ఎన్‌టీడీసీ)లో శిక్షణ ఇప్పించారు. అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు, ఇతర జంతువులు దారి తప్పి గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో దారి తప్పిన జంతువుల ట్రాక్‌ను గుర్తించడానికి డాగ్ స్క్వాడ్‌ను వినియోగిస్తున్నారు. అలాగే కలప, పులి చర్మాలు, ఏనుగు దంతాలను అడవుల్లో రహస్య ప్రదేశాల్లో స్మగ్లర్లు దాస్తుంటారు. అలా దాచిన ప్రదేశాలను గుర్తించడంలో డాగ్‌స్క్వాడ్ పని చేస్తుంది.