Tuesday, November 19, 2024

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం దళారులను నమ్మెద్దు: మంత్రి తలసాని

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళ కోసం దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హులైన వారందరికీ పారదర్శంగా ఇళ్ళు కేటాయిస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. సిఎం కేసీఆర్‌ ఆలోచన మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని నారాయణ జోపిడీ సంఘంలో రూ.22.94 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 296 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళ నిర్మాణానికి హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలు సంతోషంగా సొంటి ఇంటిని కలిగివుండాలన్నదే సిఎం కేసీఆర్‌ ఆశయమని అన్నారు. పలు జిల్లాల్లో ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. మురికి కూపాలను తలపించే బస్తీలు నేడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ కింద పేదింటి ఆడపడుచుల వివాహానికి లక్షా 116 రూపాలయ ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సాయన్న, బేవరేజెస్‌ కారోరేషన్‌ ఛైర్మన్‌ నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement