వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఎంతమాత్రం సహించేదే లేదని వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౌడీయిజం చెలాయిస్తే కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే తాట తీస్తామన్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ పరిధిలోనీ 52 మంది రౌడీ షీటర్లకు అదనపు డీసీపీ, టాస్క్ ఫోర్స్ ఇన్‌చార్జి వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ కౌన్సిలింగ్ నిర్వహించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ట్రై సిటీ పరిధిలోని రౌడీ షీటర్లకు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో బుధవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్ల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ.. రౌడీలు సత్ప్రవర్తనతో మెలిగి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడపవచ్చనన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఓరుగల్లు నగరం సాంకేతికంగా, పారిశ్రామికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరంలో ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని తేల్చిచెప్పారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునే చర్యలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
ఓరుగల్లులో భూకబ్జాలు, సెటిల్మెంట్స్, మహిళలపై జరిగే దాడులు, వేధింపులకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు. ప్రతి రౌడీషీటర్ కదలికలపై పోలీసుల నిఘా ఉందన్న విషయం మర్చి పోవద్దన్నారు. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడ్డ, చట్ట ప్రకారం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ముఖ్యంగా సత్ప్రవర్తనతో జీవించే వారి పేర్లను రౌడీషీటర్ జాబితా నుండి తోలగించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. పదేళ్లుగా ఏటువంటి క్రిమినల్ కేసులలో పాల్గొనకుండ ఉండి, వారి పనుల్లో వారు నిమగ్నమై, ప్రవర్తనను మార్చుకున్న వారి పేర్లను రౌడీషీటర్స్ జాబితా నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిలింగ్ నిర్వహణలో టాస్క్ ఫొర్స్ ఇన్స్ స్పెక్టర్లు సీహెచ్. శ్రీనివాస్, జీ. సంతోష్, ఎస్సై లు ప్రేమనందమ్, లవణ కుమార్ తో పాటు టాస్క్ ఫొర్స్ హెడ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.