కమలాపూర్, (ప్రభ న్యూస్) : రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఈరోజు కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఈటల రాజేందర్ పర్యటించారు. బత్తినివారి పల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎదుర్కొంటున్న పాపం కేసీఆర్ దేనన్నారు. నాలుగు రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేయని యెడల కలెక్టరేట్ల ను ముట్టడిస్తామని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. దాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందుచూపు లేకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తడుస్తున్న ధాన్యం, మొలకెత్తుతున్న ధాన్యంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ వర్షాకాలంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పినప్పటికీ వచ్చే సీజన్ కు ముడిపెట్టి కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ఉసురు కొట్టుకునే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని, కేసీఆర్ రాజకీయాలు చేసుకోండి.. కానీ రైతుల జీవితాలతో చెలగాటం మాత్రం ఆడుకోవద్దని హెచ్చరించారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదు అని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఈ సందర్భంగా ఈటెల గుర్తుచేశారు. రైతులతో పెట్టుకున్న ఎవరైనా సరే ముందుకు పోలేరని, కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పి ఉందాగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను తెలివి తక్కువ వారిగా, చదువురాని వారిగా భావించుకుని వారితో చెలగాటమాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు రైతులు కర్రు కాల్చి కేసీఆర్ కు వాత పెడతారని ఈ సందర్భంగా ఈటెల తెలిపారు. గత నెల రోజులుగా వర్షాలకు తడుస్తున్న ధాన్యాన్ని, మొలకెత్తుతున్న ధాన్యంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కన్నీరు పెడుతున్నారని నాలుగు రోజుల్లో రోడ్లపై ఉన్న ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేనిచో జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగి రైతులతో ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..