తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు మరో 19 పద్దులపై చర్చ కొనసాగుతుంది. నిన్న (సోమవారం) ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభ్యులకు కీలక సందేశం ఇచ్చారు.
నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని స్పీకర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఒక్కో సభ్యునికి 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఆ సమయంలోనే మాట్లాడాలని సభ్యులకు సూచించారు. కాగా..ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యాయి. నేడు సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశంలో తొమ్మిది శాఖల సమస్యలపై చర్చించనున్నారు.
మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసు, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమంపై నేడు చర్చ జరగనుంది. సాగునీరు, పౌర సరఫరాల సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, పర్యాటక శాఖ సమస్యలపై శాసనసభలో చర్చ జరగనుంది. దేవాదాయ, అటవీ శాఖల సమస్యలపై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మాతా శిశు సంక్షేమంపై సభలో చర్చించనున్నారు.