Friday, November 22, 2024

TS | గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ.. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన జీఏడీ?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలననుసరించి ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఎన్నికల విభాగం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తనను ఈనెల 8 లేదా 9వ తేదీన శాసన సభ్యురాలిగా ప్రమాణం చేయించేందుకు ఆహ్వానించాలని డీకే అరుణ ఇప్పటికే అసెంబ్లి స్పీకర్‌, కార్యదర్శిని కోరింది. ఈ మేరకు తన వినతిని లిఖిపూర్వకంగా స్పీకర్‌, కార్యదర్శి కార్యాలయాలకు వెళ్లి అందించారు. అసెంబ్లి స్పీకర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించినట్టు అరుణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు.

వికాస్‌రాజ్‌తోనూ అరుణ భేటీ.. కోర్టు తీర్పు ప్రతి అందజేత
తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వికాస్‌రాజ్‌తో సమావేశమైన అరుణ తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోర్టు తీర్పును అందించారు. డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, పార్టీ నేతలు ఆయనను కలిశారు. #హకోర్టును ఇచ్చిన తీర్పు ప్రతులను వికాస్‌రాజ్‌కు అందించారు. అందుకు సమాధానంగా త్వరలోనే సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి.. సమాచారం ఇస్తారని తెలిపినట్లు డీకే అరుణ చెప్పారు. కోర్టు తీర్పును అమలు చేస్తారన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు.

24న హైకోర్టు తీర్పు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ ఆగస్టు 24న #హకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో రెండో స్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారంటూ ఆయనపై వేటు వేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘించినందున రూ.2.50 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు.. పిటిషనర్‌ డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇలానే అంతకు ముందు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక కూడా చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో మళ్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement