Friday, November 22, 2024

సంజయ్‌తో అసమ్మతి నేతల భేటీ.. ఇప్ప‌టికైతే లొల్లి లేన‌ట్టే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీలో కొంత కాలంగా కలకలం సృష్టిస్తున్న అసమ్మతి స్వరాలు దారికి వచ్చాయి. శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో అసమ్మతి నేతలంతా భేటీ అయ్యారు. పార్టీ సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్న సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి సూచన మేరకు అసమ్మతి నేతలతో సంజయ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసమ్మతి నేతలంతా ఇక నుంచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీలో దీర్ఘకాలంగా పని చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు లేకుండా పోయిందనే ఆవేదనతోనే భేటీ అయ్యామని, పార్టీని వీడటం కానీ, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పని చేయాలన్న ఉద్దేశ్యం తమకు లేదని వారు తేల్చి చెప్పారు. తమలో కొంత కాలంగా ఉన్న అభిప్రాయాలను పంచుకుందామన్న ఉద్దేశ్యంతోనే భేటీ అయ్యామని, ఈ భేటీలో ప్రస్తుతం పార్టీ పనితీరు, నాయకత్వ నిర్ణయాలు, ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆధరణ తదితర అంశాలన్నీ చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. పార్టీని వీడేది లేదని, జరిగిందానికి చింతిస్తున్నామని కూడా నేతలు చెప్పినట్లు తెలిసింది.

సంజయ్‌ మాట్లాడుతూ, అధిష్టానం చెప్పిన పని చేయడమే తనకు తెలుసని, పార్టీలోని ప్రతి ఒక్కరూ తనకు సమానమన్నారు. ఎవరినో కించపరచాలని, ఎవరినో చిన్న చూపు చూడాలన్న ఉద్దేశ్యం తనకు లేదని, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టీఆర్‌ఎస్‌పై ఉదృతంగా పోరాడితే తప్ప రానున్న కాలంలో పార్టీ అధికారంలోకి రాదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నాం తప్ప సీనియర్లను పక్కకు పెట్టాలన్న ఉద్దేశ్యం లేనేలేదని చెప్పారు. ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలవచ్చని, సమస్యను మనసు విప్పి చెప్పవచ్చన్నారు. తన పరిధిలో సమస్య ఉంటే అప్పటికప్పుడు పరిష్కారమవుతుందని, లేకపోతే పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరం కలిసి పని చేద్దాం, ప్రజా కంటక పాలకులను ఇంటికి పంపిద్దాం, ఈ లక్ష్యంతోనే ముందుకు సాగుదామని అన్నారు. ఈ సమావేశంలో సంజయ్‌, ఇంద్రసేనారెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు, సుగుణాకర్‌రావు, కె. రాములు, చింతా సాంబమూర్తి, సుభాష్‌చందర్‌జీ, బి. జనార్థన్‌రెడ్డి, వెంకటరమణి, నాగూరావు నామోజీ, అలిజాపూర్‌ శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement