మోత్కూర్, జనవరి 20 (ప్రభ న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసం సెగలు ఆజ్యం పోసుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ చైర్మన్‌లుగా ఉన్న భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీలలో ఇప్పటికే అవిశ్వాసం పెట్టి కలెక్టర్ కు మెజార్టీ కౌన్సిలర్లు తీర్మానం కాపీలు అందించారు.
తాజాగా బీఆర్ఎస్‌కు చెందిన మోత్కూర్ మున్సిపల్ ఛైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డిపై అవిశ్వాస తీర్మాణం చేయాలని కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలిశారు. మొత్తం 12మంది కౌన్సిలర్‌లలో 9మంది కౌన్సిలర్లు కలిసి జిల్లా కలెక్టర్ హన్మంత్ కె జెండగేను కలిసి అవిశ్వాస తీర్మాణం కాపీని అందజేశారు. ఇందులో ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉండడం గమనార్హం. మరో ఏడాది గడువు ఉండడం, చైర్మన్ గతంలోనే కౌన్సిలర్లను నిర్లక్ష్యం చేస్తున్నారని బిఆర్ఎస్ అధికార సమయంలోనే ఓ సమావేశాన్ని సైతం బహిష్కరించారు. అప్పటి ఎమ్మెల్యే కిషోర్ ఆదేశాలతో అవిశ్వాసంకు తెరపడింది. తాజాగా మరోసారి అవిశ్వాస తీర్మాణం కాపీ కౌన్సిలర్లు కలెక్టర్‌కి అందజేయడంతో మోత్కుర్ మున్సిపల్ పీఠం ఎవరికీ దక్కుతుందని ఆసక్తి నెలకొంది.