Friday, November 22, 2024

Delhi | సుప్రీంలో బీఆర్‌ఎస్‌కు నిరాశే.. గుర్తులపై పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘కారు’ గుర్తును పోలిన గుర్తులను ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

‘కారు’ గుర్తును పోలిన చపాతీ కర్ర, రోడ్డు రోలర్, కెమేరా తదితర గుర్తులను ‘ఫ్రీ సింబల్స్’ జాబితా నుంచి తొలగించాలని, అదే సమయంలో ‘యుగ తులసి’ పార్టీకి కేటాయించిన ‘రోడ్డు రోలర్’ గుర్తును తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవే అభ్యంతరాలతో సెప్టెంబర్ 27న ఆ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు.

- Advertisement -

‘రోడ్డు రోలర్’ గుర్తు కారణంగా తమ పార్టీకి జరిగిన నష్టాన్ని వివరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల కారణంగా చాలా ఓట్లు నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్ష్యరాస్యులు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రజలకు కారుకు, చపాతి కర్రకు, రోడ్డు రోలర్ తేడా తెలియదు అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుకుంటున్నారా అంటూ ధర్మాసనం అసహనం ప్రదర్శించింది. ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాదాపు 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం వెనుక ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించింది. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా అంటూ బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement