Saturday, November 23, 2024

TS: గవర్నర్‌ ప్రజా దర్బార్‌పై భిన్నాభిప్రాయాలు.. నేరుగా ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యమెలా అంటూ ప్రశ్నలు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహించిన మహిళా దర్బార్‌పై భిన్నమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. గవర్నర్‌ దర్బార్‌ నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అంటూ పలు మాధ్యమాల్లో జోరుగా చర్చ జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 163 ప్రకారం గవర్నర్‌ కేవలం ముఖ్యమంత్రి, మంత్రి మండలికి సలహా, సహాయ సహకారాలు మాత్రమే అందించాల్సి ఉందని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె దర్బార్‌పై విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నర్‌ విచక్షణాధికారాలు రాజ్యాంగం నిర్దేశించినట్టుగా పరిమితమైనవని రాజ్యాంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరించి రాజ్యాంగంలో పొందుపరిచినట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా గవర్నర్‌ విక్షణాధికారాలు రాజ్యాంగంలో ఇలా ఉన్నాయి…

  1. రాజ్యాంగబద్ధమైన విచక్షణాధికారాలు
  2. పరిస్థితులకు అనుగుణంగా సంబంధించిన అధికారాలు
    గవర్నర్‌ రాజ్యాంగబద్ధమైన విచక్షణాధికారాల్లో పలు సందర్భాల్లో తమ రాజ్యాంగ విచక్షణతో వ్యవహరించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వు చేయవలసిన సందర్భంలో, మంత్రి మండలి సలహా లేకుండానే గవర్నర్‌ స్వీయ విచక్షణతో సొంత నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది.
    రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాల్సిన సందర్భంలో గవర్నర్‌ సొంత అభీష్టం మేరకు వ్యవహరించేందుకు చట్టంలో, రాజ్యాంగంలో అవకాశం ఉంది. అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుడిగా గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పటించినపుడు కూడా సొంత నిర్ణయం తీసుకోవచ్చు. అంతేకాకుండా అస్సోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం వంటి ప్రాంతాల స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన జిల్లా కౌన్సిల్‌లలో ఖనిజాన్వేషణ కోసం లైసెన్స్‌ల ద్వారా రావలసిన రాయల్టిdని నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

పరిస్థితుల సంబంధిత అధికారాలు…
ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన పూర్తిస్థాయి మెజారిటీ రాని సందర్భంలో గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధికారం ఉంది. అలాగే పదవిలో ఉన్న వ్యక్తి మరణించిన సందర్భాల్లో ముఖ్యమంత్రిని నియమించాల్సి వస్తే కూడా గవర్నర్‌కు పరిస్థితుల విచక్షణ అధికారం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర శాసనసభలో విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోయిన ప్రభుత్వాన్ని, మంత్రి మండలిని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ఈ సందర్భంలో రాష్ట్ర శాసనసభను సకాలంలో రద్దు చేసిన సందర్భంలో ప్రభుత్వాన్ని, మంత్రి మండలిని సంప్రదించకుండా సొంతంగా తన అభీష్టానుసారం మేరకు నడుచుకునేందుకు అవకాశం ఉంది. విద్య కోసం ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాల్సిన వచ్చిన సందర్భాల్లో కూడా గతంలో పలు ప్రాంతాల్లో గవర్నర్లు స్వీయ నిర్ణయం తీసుకున్న ఉదంతాలున్నాయి.

ఇలా మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడాల కోసం ప్రత్యేక అభివృద్ధి బోర్డులను, అదే తీరులో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌లకు వేర్వేరు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేసిన సందర్భాల్లో అక్కడ గవర్నర్లకు విశేష అధికారాలు కట్టబెట్టారు. నాగాహిల్స్‌ తున్‌ సాంగ్‌ ప్రాంతంలో అంతర్గత అలజడుగు కొనసాగుతున్నంతకాలం గవర్నర్లకు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాలు కట్టబెట్టారు. నాగాలాండ్‌, అస్సాంలలోని గిరిజన ప్రాంతాల పాలన, మణిపూర్‌లోని కొండ ప్రాంతాల పరిపాలనకు, సిక్కింలోని వివిధ వర్గాల శాంతి, సామాజిక, ఆర్థిక పురోగతి కోసం అదే తీరులో అరుణాచల్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గవర్నర్లకు అధికారాలను కట్టబెట్టారు.

గతంలో కూడా కర్నాటకలో హైదరాబాద్‌, కర్నాటక ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాల్సిన సందర్భంలో ఇలా ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. కేవలం ఈ నిర్దేశిత అవసరాలకు మినహా గవర్నర్‌ను ఎటువంటి ఇతర విచక్షణాధికారాలను రాజ్యాంగం ప్రకారం అమలు చేయడానికి వీల్లేదు. అయితే సొంతంగా రాజ్యాంగపరమైన అనుమతిని దాటి విచక్షణలను అమలు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా పరిగణిస్తామని భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల ఆదేశిక హక్కులపై దాడిగా పరిగణించబడుతుందని రాజ్యాంగం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement