హైదరాబాద్: ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 పోస్టర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ షేక్ రషీద్ ఆవిష్కరించాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్‌లో జరిగిన స్కూల్ ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రషీద్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ వర్థమాన క్రికెటర్లను ప్రోత్సహించడానికి అండర్-14 స్థాయిలో టీ20 లీగ్ నిర్వహించడం గొప్ప విషయమన్నాడు. ఇలాంటి లీగ్‌ల్లో ఆడడం వల్ల ప్రతిభ గల క్రికెటర్లు త్వరగా వెలుగులోకి వస్తారని చెప్పాడు. తాను స్కూల్ క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇలాంటి ఫ్రాంచైజీ లీగ్‌లు లేవని, ఎక్కడ టోర్నమెంట్లు జరుగుతున్నాయో, వెతుక్కోని ఆడేవాడినని తెలిపాడు. సెలెక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని, ఈ లీగ్‌లో ఆడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రషీద్ కోరాడు.
డీపీఎస్ (నాచారం), పల్లవి విద్యాసంస్థల సీఓఓ యశస్వి మాట్లాడాతూ అనేక కష్టాలను ఎదుర్కొని, ఒక పేద కుటుంబం నుంచి పైకొచ్చిన రషీద్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అతడిని ప్రేరణగా తీసుకొని, క్రికెట్‌లోనే కాకుండా విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో కష్టపడి రాణించాలని సూచించారు. 2022 అండర్-19 వరల్డ్‌కప్‌లో రాణించి, తన సత్తా నిరూపించుకున్న రషీద్, భవిష్యత్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడంతో పాటు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యశస్వి ఆకాంక్షించారు.
ఆసక్తి గల క్రీడాకారులు లీగ్‌లో ఆడేందుకు ఈ నెంబర్లకు 7396386214, 7618703508 ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీన సెలెక్షన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌డీసీఏ తెలంగాణ భాగస్వామి బ్రైనాక్స్ బీ డైరెక్టెర్ రషీద్ బాషా, 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టెర్ బి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.