మంగపేట ( ప్రభ న్యూస్) : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని తెలంగాణ సెంటర్ లో శుక్రవారం ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ఢీ కొన్న సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాన్ని ఆర్టీసీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రేస్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన మంగపేట తెలంగాణ సెంటర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ.. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాం నగర్ కు చెందిన మడవి సురేష్ ,చిన్నారి దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో పాటు వారి ఇద్దరు కుమారులైన మడవి నరేష్, మడవి శివలు మృతి చెందడం బాధాకరమన్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన మడవి సురేష్ ,చిన్నారి దంపతుల ఇద్దరు కుమారులు మృతి చెందడమే కాకుండా మడవి సురేష్ ,చిన్నారి దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆర్టీసీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, మృతుల కుటుంబానికి రూ. 25లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మంగపేట ఎస్సై ఎస్కే.తాహెర్ బాబా సంఘటన స్థలం వద్దకు చేరుకుని.. ఆందోళన చేస్తున్న వారికి నచ్చ చెప్పడంతో కాంగ్రేస్ శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.