న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేసి ప్రగతి భవన్‌లో డ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. రైతుల వద్ద నుంచి వడ్లను తామే కొంటామని మంగళవారం సాయంత్రం కేసీఆర్ ప్రకటించిన అనంతరం ఆయన ఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులు అడ్డికి పావు షేరు కింద ధాన్యం అమ్ముకున్న తర్వాత ఇప్పుడు కేసీఆర్ కొంటాననడం వెనుక దోపిడీ కోణం ఉందని, రైతులను మభ్యపెట్టడానికే ఇలా చేస్తున్నారని పొన్నాల ఆరోపించారు.
ఇప్పటికే చాలా చోట్ల వడ్ల అమ్మకాలు జరిగాయన్న ఆయన, ముడి బియ్యమైనా, ఉప్పుడు బియ్యమైనా రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. అంసబద్దమైన పరిపాలనతో రైతులను మోసం చేస్తూ అన్నదాతపై ప్రయోగాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఢిల్లీలో గంటసేపు కూడా ధర్నా చేయలేదని పొన్నాల దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనాలని కాంగ్రెస్ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోందని, ఇక ప్రజలు కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 30 శాతం మంది రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నారని, ఆ వడ్లకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.