మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ పేదల కొంపలు ముంచుతుందని, ధరణి వల్ల చాలా మంది పేద ప్రజలు భూమికి దూరమవుతున్నారని, ఈ చరిత్ర కేసీఆర్ కే దక్కిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం చౌరస్తాలో మంగళవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనను బయటపెట్టేందుకే బీజేపీ పార్టీ 11వేల కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేసి ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరిస్తుందని తెలిపారు. కేసీఆర్ కు దళితులంటే చిన్న చూపని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే కనీసం అధికార లాంచనలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.
మొన్నటి వరకూ సీఎం కార్యాలయంలో గిరిజన, దళిత, బీసీ, మైనారిటీ లు ఒక్కరు కూడా లేరని, ఏడేళ్ల కాలంలో ఒక్క దళితుడికి భూమి ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రాష్ట్రంలో పేదల బ్రతుకులు మారుతాయని అనుకుంటే చిన్న చిన్న భూములున్న పేద రైతులను బిచ్చ గాళ్ళు గా మార్చారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ధరణితో తన ఫ్యూడల్ భావజాలాన్ని సీఎం కేసీఆర్ బయట పెట్టారని, తాతల కాలంలో భూములమ్ముకొని ఊరు వదిలిపెట్టిన వారి పేరుపై ధరణిలో భూములు చూపడంతో మళ్లీ గ్రామాలకు వచ్చి పేద రైతుల కంట్లో మట్టి కొట్టి.. ఉన్న కాస్త భూమిని కూడా లాక్కొని అమ్ముకున్నారని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కోటి ఎకరాల మాగాణి అని గొప్పలు చెప్పిన కేసీఆర్ రైతులు పండించిన పంటలో ప్రతీ సంచిలో నాలుగు కిలోల ధాన్యం దండుకుంటున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతుంటే తనకు మాట్లాడే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళా సంఘాలకు చెల్లించాల్సిన బకాయి కూడా చెల్లించలేదన్నారు. 2024 సంవత్సరంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మాచారి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, నాయకులు ఎన్.పి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, జయశ్రీ బీజేవైఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.