యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఇవాళ్టి నుంచి ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి 30 రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో భాగంగా ప్రతీ రోజు వేకువజామున 4.30 నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖమండపంపై ఉత్తర భాగంలోని హాలులో అమ్మవారికి వేంచేపు వేసి తిరుప్పావై నిర్వహించారు.
అదేవిధంగా గోదాదేవి వ్రతపర్వ, మార్గళి, పాశురాల పఠనం నిర్వహించనున్నారు. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కల్యాణం, 15న ఉదయం ఒడిబియ్యం సమర్పణ జరుగుతుందని ఆలయ ఈవో గీత తెలిపారు. ఆదివారం కావడంతో యాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచివున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది.