భద్రాలచం, వేములవాడ, యాద్రాద్రి-ఆంధ్రప్రభ – రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారంలో వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారు జాము నుంచి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. నారాయణుడి నామస్మరణలతో ఆలయాల ప్రాంగణాలు మార్మోగుతున్నాయి. ఇందుకు తగినట్లుగా ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా విష్ణువును దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
భద్రాచలం సీతారామాలయం కిటకిట
భద్రాచలం సీతారామాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణ అంతా కిటకిటలాడుతోంది. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తుల జయజయధ్వానాలు.. మంగళ వాయిద్యాలు.. వేదమంత్రాల నడుమ భద్రాద్రి రామయ్య గరుఢవాహనంపై అధిరోహించగా, గజవాహనంపై సీతమ్మ తల్లి, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి తెల్లని మేఘాలవలే అలుముకున్న ధూప మంజరల మధ్య భక్తులకు దర్శనమిచ్చారు.
రెవిన్యూ శాఖ ఆధ్వరంలో భక్తరామదాసు సేవ
భక్తరామదాసు తహాసీల్దార్ ఉద్యోగం చేయడం వల్ల భద్రాచలంలో భక్తరామదాసు సేవను రెవిన్యూ శాఖ నిర్వహించడం ఆనవాయితీ. అదేవిధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా భక్తరామదాసు పేరిట శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకం జరిగింది. ఈ సేవను రెవెన్యూ శాఖ నిర్వహించింది. అభిషేకం అయిన తర్వాత లఘు అరాధన జరిగి మళ్లీ విశేషంగా తిరుమంజనం నిర్వహించారు. భద్రాద్రి రాముడు ధనుర్బాణాలను అలంకారాలుగా ధరించి, రాజఠీవితో గరుడ వాహనాలం కృతుడవగా… ప్రత్యేకంగా అలంకరించబడిన ఉత్తర ద్వారం లోపల సీతారామ లక్ష్మణ స్వాము ప్రతిమలను అర్చకులు ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్తర ద్వార దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. ఈ సందర్భంగా భక్తరామదాసు కీర్తనలు ఆలపించారు. ఈ వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రెవిన్యూ శాఖ మంత్రి సతీమణి మాధురి రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం, పినపాక, ఇల్లందు శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్ పి రోహిత్ రాజు, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్, రామాలయం ఈ ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
రాజన్న క్షేత్రంలో…
ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి సన్నిధిలో విశేష పూజలను నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ ద్వారా ఉత్తర ద్వార ప్రవేశం కల్పించి పెద్ద సేవపై అధిరోహణ, ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం రాజగోపురం వరకు చేరుకొని వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవ విశిష్టత ప్రవాచనాలు గావించారు. ఆలయ గోపురం, ఉత్తర ద్వారం, ఆలయ పరిసరాల్లో, అనుబంధ దేవాలయాల్లో రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు.
ప్రముఖుల తాకిడి
వైకుంఠ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆది శ్రీనివాస్ స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మొక్కులు చెల్లించుకుని రాజన్న ఆలయ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఏనుగు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మధు పుల్కం రాజు తదితరులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
యాద్రాద్రికి పోటెత్తిన భక్తులు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరీశుడు ఉత్తరద్వార దర్శన మిచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షపుష్పార్చన, ఆర్జిత సేవలు రద్దు చేశారు. అలాగే నేటి నుంచి ఈ నెల 15 వరకు యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఆరు రోజుల పాటు అలంకార సేవల్లో లక్ష్మీనరసింహా స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
స్వర్ణగిరిలో…
యాదాద్రి భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. స్వర్ణగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఘనంగా ముక్కోటి వేడుకలు
పెద్దపల్లి, – ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామునుండే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు