Thursday, January 30, 2025

Devotional – నాగోబా జాత‌ర నేటి నుంచే షురూ

గిరిజనుల ఇలవేల్పు నాగోబా
నేటి రాత్రి తొలిపూజ చేయ‌నున్న‌ మెస్రం వంశీయులు
గోదావరి జలాలలో నాగోబాకు అభిషేకం,
అనంత‌రం మహాపూజ నిర్వ‌హ‌ణ‌
ఇప్ప‌టికే వేలాదిగా నాగోబాకు చేరుకుంటున్న భ‌క్త‌జనం
శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అదిలాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ ః ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దైవం, మెస్రం వంశస్థుల ఇలవేల్పు నాగోబాకు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించే మహాపూజకు వేళయింది. మరికొన్ని గంటల్లో ఈ మహాకార్యక్రమం చేపట్టనున్నారు. ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య సందర్భంగా గిరిజనుల ఇలవేల్పు నాగోబా మహాపూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం మెస్రం వంశీయులు నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేపడతారు. కాలినడకన సుమారు 250 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి తీసుకువచ్చిన పవిత్ర గోదావరి జలాలలో నాగోబాకు అభిషేకం, మహాపూజ చేయడంతో ఈ ఇక్కడ జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నిధులను కూడా విడుదల చేసింది. ఈ జాతర రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా మెస్రం గిరిజనులు తరలివచ్చి నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకొని వెళతారు.

- Advertisement -

సంప్ర‌దాయ దుస్తుల్లో..
ఇప్పటికే నాగోబా అభిషేకానికి కావాల్సిన పవిత్ర గంగా జలాలను తీసుకొని కేస్లాపూర్ కు వచ్చిన మెస్రం వంశీయులు ఆలయ సమీపంలోని మర్రి చెట్టు వద్ద విడిది చేసి ఉన్నారు. మంగళవారం రాత్రి అక్కడి నుండి గిరిజన సంప్రదాయ దుస్తుల్లో వాయిద్యాలతో ఆలయానికి చేరుకుంటారు. అనంతరం మెస్రం వంశీయులు, కట్టోడాలు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో తయారు చేయించిన కుండలను మాత్రమే గిరిజనులు ఇక్కడ పూజలకు వినియోగించడం ఆనవాయితీగా వస్తుంది.

ఆదిశేషువు కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలి – రేవంత్ రెడ్డి.
నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుకలో ఆధ్యాత్మక వెలుగులు నింపే ఆదిశేషువు కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వనమే ఆలంబనగా అత్యంత నియమ నిష్టలతో ఆదివాసీలు అందరు జరుపుకునే వేడుక “నాగోబా జాతర” అని, గిరిజన సోదర, సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. పుష్య అమావాస్య నాడు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో అంబరాన్నంటే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణ సాంస్కృతిక వైభవమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక సందేశం విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement