శ్రీశైలం (కర్నూలు బ్యూరో) శ్రీశైలంలో కార్తీకమాసోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్తీకమాసోత్సవ నిర్వహణకు వివిధ విస్తృత ఏర్పాట్లు ఆలయ అధికారులు గావించారు. ఇందులో భాగంగా భక్తులకు వసతి, మంచినీటిసరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, పారిశుద్ధ్యం, సోమవారాలలో, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీకపౌర్ణమిరోజున జ్వాలాతోరణోత్సవం, నదీహారతి మొదలైన వాటికి సంబంధించి పలు ఏర్పాట్లు చేయడం విశేషం.
సిబ్బందికి ప్రత్యేక విధులు :
ఇక భక్తులకు సేవలు అందించేందుకుగాను కార్తికమాసంలో రద్దీరోజులందు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయి.దర్శనం ఏర్పాట్లు :ఆలయం వర్చే భక్తులకు వేకువజామున గం.3.00లకు ఆలయద్వారాలు తెరచి, ప్రాతఃకాల పూజల అనంతరం వేకువజామున గం. 4.30ల నుంచి సాయంకాలం గం. 4.00ల వరకు దర్శనాలు కల్పించారు. అదేవిధంగా తిరిగి సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 11.00ల వరకు దర్శనాలు కొనసాగడం విశేషం. భక్తులను దృష్టిలో పెట్టుకొని రెండువిడతలుగా రుద్రహోమం, మృత్యుంజయహోమం జరిపించనున్నారు.
ఇక క్యూ కాంప్లెక్స్లోలోని భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందజేశారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీకమాసంలో శ్రీస్వామివారి గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేయబడ్డాయి.రద్దీరోజులలో సామూహిక ఆర్జిత అభిషేకాలు కూడా నిలుపుదల చేనున్నట్లు అధికారులు ముందే ప్రకటించారు.అదేవిధంగా రద్దీరోజులలో ( మొత్తం కార్తికమాసం 16 రోజులు) శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం కూడా నిలుపుదల చేశారు.
ఈ రోజులలో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతోంది. కాగా సాధారణ రోజులలో రోజుకు మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకములకు, శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి వీలు కల్పించబడింది. ఇక స్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.
లోకకల్యాణం కోసం ప్రతీ సంవత్సరం శ్రావణ, కార్తీకమాసాలలో దేవస్థానం శివచతుస్సప్తాహ భజనలు నిర్వహిస్తోంది. అంటే నెల పూర్తిగా రేయింబవళ్లు నిరంతరంగా ఈ భజన సాగుతుంది. ఈ పవిత్ర అఖండ భజనలు కార్తీకమాసోత్సవాల ప్రారంభం సందర్భంగా నేటి ఉదయము నుండి ప్రారంభమయ్యాయి. ఈ అఖండ భజన మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున అంటే డిసెంబర్ 2 న ముగించనున్నారు.
ఈ ప్రారంభకార్యక్రమములో ఇంఛార్జి కార్యనిర్వహణాధికారి ఈ. చంద్రశేఖరరెడ్డి, అర్చకస్వాములు, అధికారులు పాల్గొన్నారు.
కాగా ఈ భజనలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం భజనకార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను జరిపించడం విశేషం. ఆ తరువాత శాస్త్రోక్తంగా చండీశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. ఈ పూజల అనంతరం శివప్రణవ పంచాక్షరీనామ అఖండ భజన ప్రారంభించారు.
కాగా ఈ భజనలలో కర్నూలు జిల్లాకు చెందిన రెండు భజన బృందాలకు, కర్ణాటకకు చెందిన నాలుగు భజన బృందాలకు అవకాశం కల్పించారు.
లడ్డు ప్రసాదాలు:
కార్తీకమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేయడం విశేషం. ఇక పుష్కరిణి వద్ద నిర్వహించిన లక్షదీపార్చన, పుష్కరిణి హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీకసోమవారాలలో పౌర్ణమిరోజున పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.కార్తీకదీపోత్సవం భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తరమాడవీధి,గంగాధరమండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం.
పుణ్యనదీ హారతి
నవంబరు 15న కార్తీకపౌర్ణమి సందర్భంగా పాతాళగంగలో పుణ్యనదీహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ సందర్భంగా పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు, సారె సమర్పించనున్నారు.
అదేవిధంగా జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నవంబరు 15వ తేదీ సాయంకాలాన నిర్వహించబడుతుంది.సాంస్కృతిక కార్యక్రమాలుఆలయ నిత్యకళావేదిక వద్ద ప్రతిరోజు సాయంత్రం ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇక లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి రోజులలో పుష్కరిణి వద్ద ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విశేషం