ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లక్ష్మీ నారాయణ స్వామి జాతర ఉత్సవాలు అశేష భక్తజన సందోహం మధ్య గురువారం ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగు మహారాష్ట్ర నుండి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. పురవీధుల గుండా లక్ష్మీ సమేత శ్రీమన్నారాయున్ని డప్పుల వాయిద్యాలు భజంత్రీల మధ్య ఊరేగించి మంగళ హారతులతో స్వామివారికి భక్తులు నీరాజనం పలికారు.
భక్తుల కొంగుబంగారం లక్ష్మీనారాయనుడు..
ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నారాయణని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు పోటెత్తారు. కాకతీయుల నాటి 12వ శతాబ్దంలో నిర్మించిన పురాతన రాతి ఆలయంలో కొలువైన నారాయణస్వామిని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, దేవాలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా భక్తుల పూజలు అందుకునే జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి జాతర ఉత్సవాలు ఈనెల 27 వరకు కొనసాగుతాయని ప్రధాన పురోహితులు తెలిపారు. ప్రతిరోజు ఆలయంలో విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.