Monday, November 25, 2024

TS : రాజ‌న్న క్షేత్రంలో కిక్కిరిసిన భ‌క్తులు.. ఆల‌యంలో ఉగాది శోభ‌…

ఉగాది పర్వదినం పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన శోభను సంతరించుకుంది.పండుగ సందర్భంగా ఆలయ అధికారులు రంగురంగుల పూల అలంకరణలతో, పండగ వాతావరణం ఉట్టిపడేలా దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామి వారి కళ్యాణ మండపంలో పంచాంగ పూజ నిర్వహించి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.

- Advertisement -

తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు మంగళవారం వేకువజాము నుండే భక్తులు బారులు తీరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పోలిస్తే స్థానిక ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలే అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా భక్తుల రద్దీతో పాటు ఉగాది ప్రత్యేక పూజల నేపథ్యంలో నేడు స్వామి వారి నిత్య కళ్యాణం, శాశ్వత కల్యాణ కార్యక్రమాలతో పాటు అభిషేక పూజలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
పండుగ పర్వదినం పురస్కరించుకుని ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు, వేదపండితులు ఉదయం తొలుత రాజరాజేశ్వరస్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి చతుష్షష్టి పూజలు, లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4:30 గంటలకు ఈవో అతిథి గృహం ముందు పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.

స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉంటూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విరాజిల్లుతూ, ఈ తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement