వికారాబాద్, (ప్రభ న్యూస్): వికారాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులను సూచించారు. ఇవ్వాల (మంగళవారం) కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, పబ్లిక్ హెల్త్ ఇ యన్ సి, ఎస్ ఇ లతో కలసి అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో రోడ్డు వైండింగ్, సెంట్రల్ లైటింగ్ పనులతో పాటు జంక్షన్ల వద్ద అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. కొత్త డివైడర్లు, రైల్వే వంతెన, అర్బన్ పార్క్ అభివృద్ధితో పాటు జంక్షన్ల వద్ద ఉన్న పాత విగ్రహాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడంపై అధికారులతో చర్చించారు.
శివసాగర్ చెరువు బండు అభివృద్ధి పనులు చేపట్టి వికారాబాద్ పట్టణాన్ని అందంగా తీర్చి దిద్దినన్నట్లు మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ తెలియజేశారు. కలెక్టర్ సూచనల మేరకు ఈ పనులను చేపట్టానన్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ యార్డులు, వైకుంఠధామాల పనులను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ పెంచాలన్నారు. గ్రీన్ బడ్జెట్ వినియోగించి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ డీఈ, ఏఈ పాల్గొన్నారు.