ఉమ్మడి మెదక్ బ్యూరో, జులై 19( ప్రభ న్యూస్): మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలుకు ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మైనారిటీల స్థితిగతులు, వారి జనాభా గురించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు ద్వారా చేకూరుస్తున్న లబ్ది గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా కేజీబీవీ లు, మైనారిటీ గురుకులాలు,చదువుతున్న విద్యార్టుల సంఖ్య,మదర్సాలు, అందుతున్న సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, కెసిఆర్ కిట్, అంగన్వాడి కేంద్రాలలో ఇస్తున్న న్యూట్రిషన్ ఫుడ్, బస్తీ దవాఖానాలు, మైనారిటీలకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు, షాది ముబారక్ లో మైనార్టీలకు చేకూరిన లబ్ధి, బ్యాంకుల ద్వారా మైనార్టీలకు అందించిన వివిధ రుణాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాల అమలు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులను ఆరా తీసారు. మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, మహిళా శిశు సంక్షేమం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మెప్మా,విద్యా, బ్యాంకింగ్, రెవిన్యూ, తదితర శాఖల ద్వారా మైనారిటీలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి ప్రగతి గురించి ఆయా శాఖల అధికారులు కమిషన్ సభ్యురాలి దృష్టికి తెచ్చారు.
అనంతరం షహేజాది మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమం కోసం ఉద్దేశించిన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. మైనారిటీల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.స్వయం సహాయక సంఘాలకు సంబంధించి వారు చేస్తున్న ఆయా పనులలో వృత్తి నైపుణ్య శిక్షణలు ఇవ్వడంపై దృష్టి సారించి నాణ్యమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.నిరుద్యోగ యువతకు అందిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాల్లో అధిక సంఖ్యలో యువతులు శిక్షణ పొందేలా ప్రోత్సహించాలన్నారు. విద్య, ఉపాధి రంగాలకు సంబంధించి మైనారిటీలకు విరివిగా రుణాలు అందజేయాలన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్ధిక తోడ్పాటును అందిస్తున్నందున, అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై వారికి అవగాహన కల్పించేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.మైనారిటీల కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వంద శాతం అమలయ్యేలా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులు అంకితభావంతో, సమర్ధవంతంగా పని చేస్తే ఎంతో మంది జీవితాలలో మార్పు వస్తుందని, ప్రభుత్వాల లక్ష్యం కూడా నెరవేరుతుందని అన్నారు. సమాజానికి మేలు చేకూర్చే పదవులలో ఉన్న వారు సేవా దృక్పధంతో విధులు నిర్వర్తిస్తే ఎంతో సంతృప్తి లభిస్తుందని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధాన మంత్రి 15 అంశాల కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,ప్రతి మూడు మాసాలకు ఒక సారి కమిటీ మీటింగ్ నిర్వహించాలన్నారు.
అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఓటర్ అవగాహన కేంద్రాన్ని ఆమె సందర్శించి, ఓటు వేసి పరిశీలించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి నగేష్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అరుణ్ కుమార్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్,
డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, సంక్షేమ శాఖ అధికారి పద్మావతి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గాయత్రీ దేవి, మెప్మా పిడి గీత, వివిధ శాఖల జిల్లా అధికారులు,ఆర్డీఓలు రవీందర్ రెడ్డి, వెంకారెడ్డి,పాండు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.