మేడ్చల్ రైల్వేస్టేషన్‌ను రూ 32 కోట్ల తో అభివృద్ధి చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ రైల్వే స్టేషన్, ఆర్‌యూబీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా రైల్వే అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల కోట్లతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
విమానాశ్రయాలను తలపించే విధంగా ఆధునికీకరణ
సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలు తలపించే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, అల్వాల్, అమ్మగూడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేస్తున్నారన్నారు. మెట్రోరైల్ మాదిరిగా ఎంఎంటీఎస్ కి కూడా దగ్గర దగ్గర స్టేషన్లు ఏర్పాటు చేయమని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని, కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత సికింద్రాబాద్లో ఉన్న ఉన్నతాధికారులను పంపించారని తెలిపారు.