ఆంధ్రప్రభ స్మార్ట్, నల్లగొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిపై మృతి చెందిన పసికందు కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. ఐదు రోజుల పసికందు మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని వారు ఆందోళనకు దిగారు. ఈ దాడిలో ఫర్నేచర్ ధ్వంసమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పోలీసులు జోక్యంతో ఆందోళన విరమించారు.
సంఘటన వివరాలు…డిండి మండలం ఎర్రారం సోమ్లా తండా కు చెందిన ఇస్లావత్ జ్యోతిని ప్రసవం నిమిత్తం భర్త రమేష్ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నెల మూడవ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు కామెర్లు ఉన్నట్టు గుర్తించిన వైద్యుడు శిశువును తాను నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురమ్మని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు శిశువును ఈ నెల ఆరో తేదీన ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
బాబు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. వైద్యం పొందుతున్న సమయంలో శిశువు కు ఇబ్బందిగా ఉన్నట్లు గుర్తించి తాము భయపడుతూ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యుని నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన
తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ప్రైవేటు వైద్యం చేస్తున్న వైద్యుడి, శిశువు మృతికి కారణమైన వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఆగ్రహంతో ఆసుపత్రి పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు.