Sunday, January 12, 2025

KNR | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంసం…

  • సీఎం రేవంత్ పై 420, 406 కేసులు నమోదు చేయాలి.
  • బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురయ్యిందని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో ఆదివారం జరిగిన ఆత్మీయ మేధోమదన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.

పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతీ ఒక్కరూ ఇన్సూరెన్స్ చెల్లించి భరోసా కల్పించుకోవాలని అన్నారు. యూ రూల్ వంటి కంపెనీలు స్థాపించి ప్రపంచ పటంలో నిలవాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో వందకు కేవలం 14 మందికే ఇన్సూరెన్స్ ఉందని గుర్తుచేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాపాలన బదులు ప్రతీకార, అక్రమ కేసుల పాలన కొనసాగుతోందని విరుచుకు పడ్డారు.

తెలంగాణ అభివృద్దికి అడ్డుపడినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎ1 నిందితునిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేసు వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చేవన్నారు. ఫార్మలా ఈ రేసు, మొబిలిటీ వ్యాలీ రద్దు చేయకుంటే తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ కు కేంద్రంగా మారేదన్నారు. చేయని తప్పుకు కెటిఆర్ ను అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేశారన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా లేదని చెబుతూ భువనగిరిలో బిఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోకుండా నిందితుడిని సిఐ కుర్చీలో కూర్చోబెట్టి రాచ మర్యాదలు చేశారన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి, 75 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు.

పోలీసుల బదులు రాక్షస గూండాలే చట్టాన్ని చేతిలోకి తీసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాజ్ భవన్ ముందు ధర్నా చేస్తే తప్పు లేదు కానీ, ఎసిబి విచారణ అనంతరం నడిచి వెళ్తే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

బండి సంజయ్ కోసం రేవంత్ బిఎస్ఎఫ్..

బిజెపి, కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి కోసం బండి సంజయ్ రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్) ఏర్పాటు చేస్తే, రేవంత్ రెడ్డి బండి సంజయ్ కోసం బి.ఎస్.ఎఫ్ (బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్) ఏర్పాటుచేశారని చురకలంటించారు. తాను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని మనమంతా ఒక్కటే అనే భావనలో రేవంత్ ఉన్నారన్నారు. అందుకే బిఆర్ఎస్ బిజెపి కాదు, బిజెపి, కాంగ్రెస్ పార్టీలే ఒక్కటని వివరించారు.

గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర…

రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్న ఆయన కెసిఆర్ పది ఏళ్లలో ప్రపంచస్థాయిలో నిలబెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే నాశనం చేసిందన్నారు. 54 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క విద్యార్థి కుటుంబాన్ని కూడా సిఎం పరామర్శించలేదని, అసెంబ్లీలో కూడా వారి గురించి మాట్లాడకుండా సినీ హీరోల గురించి గంట సేపు మాట్లాడడం దారుణమన్నారు. గురుకులాల్లో భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రాయలేదని, దుర్మార్గపు కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ వారితో చేతులు కలిసి రేవంత్ రెడ్డి పిల్లలను మార్చే కుట్ర చేస్తున్నారన్నారు.

పెద్దపల్లి బిఆర్ఎస్ నాయకులు దాసరి ఉష అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ మేధోమదన కార్యక్రమంలో టాటా కంపెనీ ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసే నిపుణులు అరుణ క్వీన్, కందికంటి విజయ్, యూ రూల్ కంపెనీ ఛీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గుంటికాడి రాణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement