నార్లపూర్‌లో విద్యార్థులు, గ్రామస్థుల ధర్నా
మెదక్, ఆంధ్రప్రభ : నిజాంపేట మండలం నార్లపూర్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ జయపాల్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. ధ్వంసం జరిగిన తీరును తెలుసుకున్నారు. దుండగలను త్వరలో పట్టుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
నార్లపూర్‌లో ఆందోళన…
సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులతోపాటు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రామ ఉపసర్పంచ్ సంజీవ్, నీలం తిరుపతి, ఎస్ఎఫ్ఐ నాయకుడు జగన్, సుదర్శనం, ప్రవీణ్, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.