హైదరాబాద్, ఆంధ్రప్రభ : భవన నిర్మాణ రంగానికి ప్రధాన వనరుగా ఉపయోగపడే ఇసుక వినియోగదారులకు సమృద్ధిగా ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక వైపు సిమెంట్, స్టీల్ ధరలు అధికంగా పెరుగుతున్నప్పటికి.. భవన నిర్మాణ రంగానికి చెందిన వినియోగదారులపై ఇసుక భారం పడకుండా తెలంగాణ మినరల్ డౌవలప్‌మెంట్ కార్పోరేషన్ ( టీఎస్‌ఎండీసీ) చర్యలు చేపట్టింది. దీంతో భవన నిర్మాణ రంగాల యజమానులకు కొంత మేర ఉపశమనం కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాగుల నుంచి టీఎస్‌ఎండీసీ ఇసుకను తవ్వి అక్కడే ఉన్న రీచ్‌ల వద్ద, నగరం చుట్టున్న స్టాక్ యార్డుల్లో వేలాది క్యూబిక్ మీటర్ల మేర నిల్వలు ఉండే విధంగా చూస్తోంది. మార్కెట్లో డిమాండ్ కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజు 60 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి స్టాక్ యార్డులో నిల్వ చేస్తుండగా.. అమ్మకాలు మాత్రం 40 నుంచి 45 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుంది. దీంతో ఇసుక ధర కూడా వినియోగదారుడికి అందుబాటులో ఉండటం వల్ల సరసమైన ధరలకే లభిస్తోంది. ప్రస్తుతం టన్ను సన్న ఇసుక రూ. 1,450 నుంచి రూ. 1,500 వరకు ధర పలుకుతోంది. దొడ్డు రకం ఇసుక కూడా రూ. 1300 నుంచి రూ. 1350 వరకు అందుబాటులో ఉన్నది. రాష్ట్ర విభజనకు ముందు ఇసుక కొరత తీవ్రంగా ఉండటం వల్ల టన్ను ఇసుకకు రూ. 2 వేల కంటే ఎక్కువగానే ధర పలికేది. తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఇసును బుక్ చేసుకోవడం, అమ్మకాలు చేయడంతో వినియోగదారులకు ఇబ్బందులు రాకుండా , ఇసుక తవ్వకాలు, అమ్మకాల్లోనూ అక్రమాలకు టీఎస్‌ఎండీసీ అడ్డుకట్ట వేసింది. ఇసుక రీచ్‌ల వద్ద ఒక క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ. 650 చొప్పున లారీల యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒక లారీలో దాదాపుగా 20 క్యూబిక్ మీటర్ల ఇసుక ( 30 టన్నుల వరకు ) ను లోడు చేస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్‌లు 50కి పైగానే ఉండగా.. ప్రస్తుతం 30 రీచ్‌ల వరకు పని చేస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలగాను హైదరాబాద్, నిర్మల్ , సంగారెడ్డి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు మినహా మిగతా జిల్లాలో మొత్తం 328 ఇసుక స్టాక్ యార్డులున్నాయి. రీచ్‌ల్లో తవ్విన ఇసుకను లారీల ద్వారా తీసుకొచ్చి స్టాక్ యార్డుల్లో డంప్ చేస్తారు. ఇక్కడి నుంచి వినియోగదారులకు టీఎస్‌ఎండీసీ విక్రయిస్తుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 70 స్టాక్ యార్డుల్లో 61,200 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నది. బుకింగ్ చేసుకున్న వినియోగదారులందరికి స్టాక్ యార్డుల నుంచి లారీలల్లో లోడ్ చేసి పంపించారు. ఈ ఇసుక స్టాక్ యార్డులు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 109 స్టాక్ యార్డులుండగా 9 యార్డుల్లో 6 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అందుబాటులో ఉంచారు. జయశంకర్ భూపాలపల్లిలో 64 స్టాక్ యార్డులకు గాను ప్రస్తుతం 7 స్టాక్ యార్డుల్లో 10 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ ఉన్నది. మంచిర్యాల్‌లో ఉన్న 25 స్టాక్ యార్డుల్లో 4 వేల క్యూబిక్ మీటర్లు, ములుగులో 13 స్టాక్‌యార్డులకు గాను 21 వేలకు పైగా క్యూబిక్ మీటర్ల ఇసుకను టీఎస్‌ఎండీసీ అందుబాటులో పెట్టింది. రాజన్న సిరిసిల్లలో 3 స్టాక్ యార్డులు ఉండగా 300, నల్లగొండలో 9 యార్డుల్లో 2000 క్యూబిక్ మీటర్లు, మెదక్‌లో 5 యార్డుల్లో 1500 క్యూబిక్ మీటర్లు, మహబూబ్‌నగరలో 300 క్యూబిక్ మీటర్లు, ఖమ్మంలో 300 క్యూబిక్ మీటర్లు, కరీంనగర్‌లో 4 వేల క్యూబిక్ మీటర్లు, పెద్దపల్లిలో 8,500 క్యూబిక్ మీటర్ల ఇసుకను టీఎస్‌ఎండీసీ అందుబాలోకి తీసుకొచ్చింది.
వర్షాకాలంలో ఇబ్బంది రాకుండా ముందస్తు చర్యలు
రాష్ట్రంలోని ప్రజల అవసరాల మేరకు ఇసుకను స్టాక్‌యార్డుల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని టీఎస్‌ఎండీసీ సీఎండీ మల్సూర్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ఇసుక అమ్మకాలకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ చేయడం వల్ల ఎలాంటి అవకతవకలకు అస్కారం లేకండా చేశామని, దీంతో వినియోగదారులకు ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వచ్చేది వర్షాకాలం ఉన్నందున ముందస్తుగానే వాగుల నుంచి ఇసుకను తవ్వి స్టాక్ట్ యార్డుల్లో నిల్వ చేస్తామన్నారు. గతేడా కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో వాగుల్లో నీళ్లు ఉన్నప్పటికి.. ప్రభుత్వం సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా స్టాక్ యార్డుల్లో ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కరోనా కారణంగా వచ్చిన ఇబ్బందులను అధిగమించామని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణరంగం ఎక్కువగా ఉండటంతో ఇసుక వినియోగం పెరిగిందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి