Saturday, January 18, 2025

ADB | జలంతో నాగోబాకు తిరుగు పయనమైన మెస్రం వంశీయులు

  • కెస్లాపూర్ నాగోబాకు చేరుకోనున్న జలం
  • ఈనెల 28న నాగోబా జాతర


జన్నారం, జనవరి 17 (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు అత్తమ్మడుగు గోదావరి రేవు నుంచి శుక్రవారం మధ్యాహ్నం మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు అనంతరం గోదావరి జలాన్ని ఝరిలో నింపుకొని పాదయాత్రగా కేస్లాపూర్ నాగోబా జాతరకు తిరిగి బయలుదేరారు. మెస్రంవంశీయుల ఆరాధ్య దైవం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ గ్రామ సమీపాన ఉన్న నాగోబా దేవాలయం ఎంతో ప్రావీన్యం చెందింది.

ప్రతి సంవత్సరం నాగోబా జాతరను మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఆదివాసీలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈనెల 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. మెస్రంవంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో 192 మంది మెస్రంవంశీయులు, ఇతరులు మురాడి వద్ద చేరుకొని ఈనెల 10న సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మురాడి వద్ద భద్రపరిచిన గంగాజల ఝరిని బయటకు తీసి ఆలయ ప్రాంగణంలో తెల్లని వస్త్రంపై ఝరిని పెట్టి సాంప్రదాయ ప్రకారం పురుషులు, మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి మండలంలోని బట్టగూడ గ్రామానికి చెందిన కటొడ కుమారుడు దేవరావు వీపుపై తెల్ల వస్త్రంతో కట్టి, వడగాం, సాలేవాడ, దర్ముగూడ, కొత్తగూడ, నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్, దస్తురాబాద్ మండలంలోని మల్లాపూర్ గోండుగూడ ఈనెల 16న రాత్రి చేరుకున్నారు.

వారందరికీ స్థానిక ఆదివాసి నేతలు రాజ్ కుమార్, రాజేశ్వర్ రావు, జంగు పటేల్, సోనేరావు, తదితరులు స్వాగతం పలికి రాత్రి భోజనం, బసకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత శుక్రవారం (ఈనెల 17న) ఉదయం కలమడుగు గోదావరిరేవులోని అత్తమడుగు చేరుకొని, ఆ రేవులో ఝరితో మెస్రంవంశీయులంతా ప్రత్యేక పూజలు చేసి, ఝరిలో గంగాజలం తీసుకొని మధ్యాహ్నం కాలినడకన పాదయాత్రగా కెస్లాపూర్ కు అదే మార్గంలో తిరుగుముఖంగా ఉట్నూరు, ఇంద్రవెల్లి వైపు బయలుదేరారు. ఈ పాదయాత్రలో పీఠాధిపతి మెస్త్రం వెంకట్రావుతో పాటు కటోడ దేవరావుపటేల్, చిన్ను పటేల్, జంగు, ఆనందరావు, తుకారం నాగనాథ్, శేఖర్, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement