హైదరాబాద్ , (ప్రభ న్యూస్): తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ కుమారుడు బైక్‌పై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ పాస్ (వాహనాలు వెళ్లే ఎత్తైన ప్రదేశం)పైకి వెళ్లి రికార్డు సృష్టించాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బత్తిని సాయివంశీగౌడ్ జూలై 2న తన సొంత బైక్‌పై బయలుదేరి.. 11 రోజుల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లోని ఉవ్‌లుంగ్లాలో 19,024 అడుగుల మోటారు పాస్ వద్దకు చేరుకున్నాడు.
ఈ బైక్ రైడ్‌లో తను రానుపోను 26రోజుల పాటు 8800 కిలోమీటర్లు ప్రయాణించానని, భారతదేశానికి ప్రాతినిథ్యం వహించాలనే తన చిన్ననాటి కలను నేరవేర్చుకున్నానని ఈ సందర్భంగా సాయివంశిగౌడ్ తెలిపారు. అంతేకాకుండా, సాయి భారతదేశంలోని చివరి గ్రామమైన తుర్డుక్, పాకిస్తాన్ సరిహద్దులోని థాంగ్ గ్రామం, సియాచిన్ బేస్ క్యాంప్ మరియు ఎత్తైన యుద్ధభూమిని సందర్శించారు.