ఖమ్మం జిల్లాలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు, రేపు పర్యటించనున్నారు . ఎర్రుపాలెంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మిషన్ భగీరథ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి వరకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక రాత్రికి మధిర క్యాంపు కార్యాలయంలో బస చేస్తారు.
రేపు 7న ఉదయం 10 గంటలకు మధిర క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి ఉదయం 10:45 గంటలకు చేరుకుంటారు. అనంతరం అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి పాల్గొంటారు. అక్కడి నుంచి ఖమ్మం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు ప్రజాభవన్ కు చేరుకుంటారు.
భట్టితో ఆటో డ్రైవర్ల భేటి
మధిర నియోజకవర్గానికి చెందిన ఆటో డ్రైవర్లు ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలవనున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామని భట్టిని కలిసి వినతిపత్రం అందజేయనున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. మండలంలోని ఆటోడ్రైవర్లందరూ శనివారం సాయంత్రం 5 గంటలకు మధిరలోని రెడ్డి గార్డెన్‌కు వచ్చి డిప్యూటీ సీఎంను కలవాలని ఆటో యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను గుర్తించి తగిన సహాయం చేయాలని కోరనున్నారు.