తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మొత్తం 8 అంశాలను ఆర్ధికమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
విభజన చట్టంలోని నిధుల పంపకం త్వరితగతిన చేయాలని కోరినట్టు వెల్లడించారు భట్టి. గత ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని, ప్రతినెలా జీతాలకంటే ఎక్కువగా అప్పులు, వాటి వడ్డీలు చెల్లించేందుకే పోతున్నాయని తెలిపారు. చెరువులు, కొండలను కాపాడాలనేదే తమ లక్ష్యమని, హైడ్రాకు ప్రజలు సహకరించాలని భట్టి కోరారు. చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉంటాయన్నారు. లెక్కలతో సహా ఎన్ని చెరువులు కబ్జాకు గురి అయ్యాయో ప్రజల ముందు పెడతామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.