Tuesday, October 29, 2024

TG | పోస్టాఫీస్‌లో డిపాజిట్లు గల్లంతు.. 50 మందికి పైగా బాధితులు

  • నకిలీ పాస్ పుస్తకాలు అందజేత
  • రూ. కోటి రూపాయలు స్వాహా
  • చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగిని
  • లబోదిబోమంటున్న బాధితులు
  • ఉన్నతాధికారుల విచారణ


రామగిరి, అక్టోబర్‌ 26 (ఆంధ్రప్రభ): కాయా కష్టం చేసుకొని పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ల రూపంలో దాచుకున్న కోటి రూపాయలకు పైగా నగదును కాజేసి ఖాతాదారులకు నకిలీ పత్రాలు అందజేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట పోస్ట్ ఆఫీస్ లో చోటుచేసుకుంది. నకిలీ పత్రాల వల్ల పోస్టాఫీస్‌లో డిపాజిట్లు గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన పోస్టల్‌ అధికారులు శనివారం విచారణ మొదలుపెట్టారు. ప్రజల నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్లు చేయించుకున్న పోస్టు మాస్టర్‌ హేమ సదరు డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డిపాజిటర్లకు నకిలీ పాస్‌ పుస్తకాలు, రశీదులు ఇచ్చారు. మోసపోయిన వారిలో దాదాపు 30నుంచి 50 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితులంతా పోస్టల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు బేగంపేట పోస్టాఫీస్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతం 50లక్షల వరకు సదరు ఉద్యోగి మోసాలకు పాల్పడినట్లు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తెలుస్తోంది.

గుండ శ్రీను అనే బాధితుడు 2017లో తన కూతురు శ్రీవర్ష పేరుతో పీఎం జీవన్‌ సమృద్ధి యోజన కింద చెల్లించగా, ప్రస్తుతం 13లక్షల 83వేలు జమ కావలసి ఉండగా, మొత్తం జమ కాలేదని వాపోయారు. అలాగే కైలాస పద్మ అనే మహిళ కట్టిన డబ్బుల ప్రకారం రూ. 12లక్షల రూపాయలకు నకిలీ పాస్‌ పుస్తకం, నకిలీ రశీదులు ఇచ్చినట్లు వాపోయింది. బాధితులందరూ పోస్ట్ ఆఫీస్ నందు ఆందోళన తెలియజేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం వివ‌రాలు వెల్లడిస్తామని పోస్టల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement