హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రస్తుత వర్షాకాల సీజన్లో దోమకాటు పెరిగిపోవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా జనం విషజ్వరాలతో బాధపడుతున్నారు. చాలా మంది ప్రమాదకరమైన డెంగ్యూ బారిన పడుతున్నారు. అయితే డెంగ్యూ నుంచి సురక్షితంగా బయటపడాలంటే … ఆ విష జ్వరాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డెంగ్యూ నివారణ, డెంగ్యూకు చికిత్సలో ఈ వ్యాధిని ముందుగా గుర్తించడమే అత్యంత కీలకమని స్పష్టం చేస్తున్నారు. డెంగ్యూను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉండడంతో డెంగ్యూ పట్ల అప్రమత్తత అవసరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పదే పదే హెచ్చరిస్తోంది. డెంగ్యూను ఆదిలోనే గుర్తిస్తే సమర్థంగా చికిత్స అందించడం ద్వారా మరణాలను 1శాతం కంటే చాలా తక్కువకు పరిమితం చేయొచ్చు. విడవని తీవ్ర జ్వరం, జలుబు, కండరాల నొప్పి, చర్మంపై దద్దుర్లు , తీవ్రమైన తలనొప్పి, కంటి కింద వాపు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. అక్కడ మలేరియా , డెంగ్యూ నిర్ధారణా పరీక్షలను చేయించుకుంటే వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చు. డెంగ్యూ నిర్ధారణ అయితే ఆ వ్యాధిని అరికట్టేందుకు నేరుగా చికిత్స అందించే ఔషధాలు లేవు.తగినంత మేర ఇంట్రావాస్క్యులర్ వాల్యూమ్ ద్వారా మాత్రమే డెంగ్యూను నియంత్రించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డాక్సీసైక్లిన్ యాంటీ బయాటిక్‌ను యాంటీ ఇన్‌ప్లnామ్మెటరీ యాక్టివిటీ , యాంటీ వైరల్ యాక్షన్‌ను డెంగ్యూ వైరస్ నియంత్రణ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఈ చికిత్స ద్వారా డెంగ్యూ శరీరంలో తీవ్ర ఇన్ఫెక్షన్ను కలిగించకుండా రోగ నిరోధకశక్తిని పెంపొందించి వ్యాధి బారి నుంచి ప్రాణాలను రక్షిస్తుంది.
ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాల్లో డెంగీ బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలతో వణికిపోతున్నారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరి నుంచే డెంగీ పంజా విసురుతోంది. వర్షాకాలం ప్రారంభమవడంతో ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, ఖమ్మం, వికారాబాద్ , వరంగల్, ములుగు తదితర జిల్లాల్లో డెంగీ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి… రెండు రోజులకు మించి జ్వరం ఉంటే టెస్టు చేయించుకోవాల్సిందే
డాక్టర్. మంగేష్ తివాస్కర్ , కన్సల్టెంట్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్. పీఆర్ఎఫ్ పూర్వ జనరల్ సెక్రటరీ.
ప్రస్తుతం డెంగ్యూకు ఎలాంటి ఔషదం లేదా వ్యాక్సిన్ లేదు. ఈ పరిస్థితుల్లో దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గం. డెంగ్యూ సోకితే ఆ వ్యాధి కట్టడికి నేరుగా అందించే ఔషధాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. డెంగ్యూకు కారణమయ్యే దోమలు పరిసరాల్లో, ఇంట్లో, కార్యాలయాల్లో, ఇతర చోట్ల వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమలు కుట్టకుండా దోమ తెరలను వాడడం, దోమల నివారణా సాధనాలను వాడడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలు ధరించడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు రోజులకు మించి తీవ్ర జ్వరం వస్తే, రోగులు తప్పనిసరిగా డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ డెంగ్యూ గుర్తించినట్లయితే, అత్యధికంగా ద్రవాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా మందులనూ తీసుకోవాల్సి ఉంటుంది. రోగులకు తగిన విశ్రాంతి ఇవ్వడంతోపాటు వైద్యుల సలహాలు తీసుకోవాలి. సొంత వైద్యం డెంగ్యూ విషయంలో చాలా ప్రమాదకరం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.