హైదరాబాద్, ఆంధ్రప్రభ: దళిత బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 9 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం.. నిరసన ప్రదర్శనలు.. ధర్నాలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ నెల 4 వ తేదీ నుంచి దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా అమలు చేస్తామని, స్వయంగా తానే కొన్ని చోట్ల దళిత బంధు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నిక కోసమే దళితబంధును తెరపైకి తెచ్చారని, దళిత బంధు కేవలం హుజురాబాద్‌లోనే నిలిపి వేయాలని ఈసీ ఆదేశిస్తే రాష్ట్ర మంతా నిలిపి వేసి బీజేపీని బూచిగా చూపించారని మండిపడ్డారు.
ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రంలోని దళితులకు మేలు చేకూర్చేందుకు దశల వారిగా పోరాటాన్ని నిర్వహించాలని నిర్ణయించిన సమావేశం ప్రారంభంగా 9 వ తేదీన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో దళితులు విస్తృతంగా పాల్గొనేలా నేతలు చొరవ చూపాలని సంజయ్ కోరారు. ఈ నెల 12 వ తేదీన నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ మార్చ్ ను 16 వ తేదీకి వాయిదా వేశారు.
దళితబంధు పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలకు ఈ నెల 9 తేదీన పిలుపును ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ సన్నాహకాలలో ఇబ్బందులు తలెత్త అవకాశాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.