కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) 2023-24 మూడు, నాలుగు త్రైమాసికాల నిధులు రూ.323.73 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. ఎన్‌హెచ్ఎంలో 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ.231.40 కోట్లు మంజురు చేయాలని కోరారు. ఎన్‌హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా.. సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023 అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌హెచ్ఎం కింద తెలంగాణకు రావల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఎంపిల ప్రమాణ స్వీకారం
ఇక తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. కొందరు తెలుగు, మరికొందరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఎంపీలు గడ్డం వంశీ కృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురాం రెడ్డి ఇంగ్లీష్‌లో, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణం చేశారు. సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణం స్వీకారం కంప్లీట్ చేశారు. ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణం స్వీకారం అనంతరం సురేష్ షెట్కర్, రఘునందన్‌రావు, ఈటల, అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డి జై తెలంగాణ అని నినాదం చేశారు. బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని స్లోగన్ ఇచ్చారు. చామల కిరణ్‌కుమార్ రెడ్డి జై లక్ష్మీ నర్సింహ స్వామి అని నినాదించగా, కడియం కావ్య జై భద్రకాళి అని, బలరాం నాయక్ జై తుల్జా భవాని అని నినాదం చేశారు. అసదుద్దీన్, మల్లురవి, కావ్య, రఘురాంరెడ్డి జై భీం అని అన్నారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం వివాదానికి దారి తీసింది. ప్రమాణ స్వీకారం అనంతరం ఓవైసీ జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం స్లోగన్ ఇచ్చారు. నిండు పార్లమెంట్‌లో జై పాలస్తీనా అని ఓవైసీ నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు పరిశీలించి.. ఓవైసీ నినాదాన్ని రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ చెప్పారు.
ఇక పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ తెలంగాణ ఎంపీల ప్రమాణాన్ని వీక్షకుల గ్యాలరీ నుంచి చూశారు. లోక్ సభ గ్యాలరీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని కలిశారు.