Tuesday, November 19, 2024

Delhi | రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలి.. రైల్వే మంత్రికి ఎంపీ నామా విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్‌ల ఆధునీకరణ, అప్‌గ్రేడేషన్‌కు, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఆయన రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డ్ ఛైర్మన్‌కు, దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖలు రాశారు. గురువారం న్యూఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

రైల్వేస్టేషన్లలో సీసీటీవీలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, రక్షిత డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, ఫుడ్ వెండింగ్ స్టాల్స్, మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు రైల్వే స్టేషన్లలో కల్పించాలని నామ పేర్కొన్నారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కనీసం రూ.40 కోట్లు మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పరిసర ప్రాంతంలో అనేక పరిశ్రమలను కలిగి ఉన్న కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి కనీసం రూ. 40 కోట్లు మంజూరు చేయాలని రైల్వే మంత్రిని ఆయన కోరారు.

- Advertisement -

సింగరేణి బొగ్గు గనులు, మణుగూరు వాటర్ ప్లాంట్, భద్రాచలం పేపర్ బోర్డ్ వంటి పెద్ద పెద్ద పరిశ్రమలున్నందున కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీతో విస్తరిస్తున్న మధిర అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ అభివృద్ధికి కూడా రూ.40 కోట్లు మంజూరు చేసి, కనీస సదుపాయాలు కల్పించాలని కేంద్రమంత్రిని అడిగారు.

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఎర్రుపాలెం, మోటమర్రి, బోనకల్, చింతకాని, కారేపల్లి, చీమలపాడు, గాంధీనగర్ రైల్వే స్టేషన్లను కూడా నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేసి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇందుకోసం ఒక్కో రైల్వే స్టేషన్ కు రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని అన్నారు. బొగ్గు రవాణాకే పరిమితమైన సత్తుపల్లి రైల్వేస్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో బహుళార్థ సాధకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే పారిశ్రామికంగా, సింగరేణిపరంగా ఎంతో విస్తరించిన మణుగూరు స్టేషన్ అభివృద్ధి కి కూడా నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేయాలని నామ నాగేశ్వరరావు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement