రానున్న ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ది చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం ఆనవాయితీ ప్రకారం మంత్రి బొమ్మకల్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి శూన్యమన్నారు. కరెంటు, నీళ్లు లేక రైతులు ఆగమయ్యారన్నారు. కరీంనగర్ చరిత్రలో ఎవరికి లేని అదృష్టం తనకే కలిగిందన్నారు. మూడోసారి కూడా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు.
కరువు కాటకాలతో రైతులంతా దుబాయ్ కి వలసలు వెళ్లారని గుర్తుచేశారు. మానేరు డ్యామ్ తలాపునకు ఉన్న తాగటానికి చుక్క నీరు లేకుండేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో కరీంనగర్ దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో కరీంనగర్ రూపు రేఖలు మారిపోయాయన్నారు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు.
పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన మంత్రి గంగుల…
ముందుగా కరీంనగర్ యజ్ఞవరహా స్వామి ఆలయంలో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొమ్మకల్ నుండి రూరల్ లో ప్రచారం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం 5.00 గంటలకు కాపువాడలోని శివాలయం నుంచి కరీంనగర్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి గంగుల కమలాకర్ నగరంలో ప్రచారం ప్రారంభించనున్నారు.