న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తండ్రీకొడుకులు కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మైనంపల్లికి సన్నిహితుడైన నక్క ప్రభాకర్ గౌడ్, భువనగిరి జిల్లా నేత కుంభం అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో న్యూఢిల్లీ రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాణిక్ రావ్ ఠాక్రే, షబ్బీర్ అలీ, చెన్నారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనంపల్లి మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానం ఆశిస్తుండగా, ఆయన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కోరుతున్నారు. వారిద్దరికీ కోరుకున్న సీట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం.
పార్టీలో చేరిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతోంది. అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయని, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ గాలి వీస్తోందని అన్నారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్‌లో పదేళ్ల పాటు ఎంతో కష్టపడి పని చేశానని, ఎప్పుడూ ప్రజలతో అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజలు, కేడర్ తనతోనే ఉందని హన్మంతరావు ధీమా వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా ఒక కార్యకర్తలా పనిచేస్తానని, తన శక్తి సామర్థాలను ప్రజా సేవకు వాడతానని స్పష్టం చేశారు.
అనంతరం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణలో రాబేయేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని నమ్ముతున్నారని, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ మేడ్చల్ టికెట్ తనకు ఇస్తానని హామీ ఇచ్చి మళ్లీ మల్లారెడ్డికే ఇచ్చారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో మల్లారెడ్డి మేడ్చల్‌లో ఉన్న కోట్లాది రూపాయల భూములను కబ్జా చేశారని విమర్శించారు. కార్పొరేషన్, కౌన్సిల్, ఎంపీటీసీ వంటి టికెట్ల కోసం కోట్లల్లో డబ్బులు వసూలు చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అతన్ని ఓడిస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ సర్వే రిపోర్టులో తమ పేరు వచ్చిందని అన్నారు. మల్లారెడ్డిని ఎదుర్కొనే నాయకుడు ఎవరికి సీట్ ఇచ్చినా మద్దతిస్తామని తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మల్లారెడ్డికి కాకుండా తమ ప్రాంత అభ్యర్థికే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు.
కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉందని అనిల్ కుమార్ అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లడం వల్ల కేడర్‌కు దూరం అయ్యానని చెప్పుకొచ్చారు. భువనగిరి ప్రజల ఆలోచన, అభిప్రాయంతో మళ్ళీ పార్టీలోకి వచ్చానని తెలిపారు. భువనగిరిలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. టికెట్ కేటాయింపు విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
కాంగ్రెస్ ఓబీసీ నేతల భేటీ
మరోవైపు టీ కాంగ్రెస్ కీలక ఓబీసీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. గురువారం రాత్రి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమై అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బీసీలకు తగిన వాటా ఇవ్వాలన్న డిమాండ్‌పై చర్చలు జరిపారు. అధిష్టానం పెద్దలను కలిసి తగిన ప్రాతినిథ్యం కోసం ఒత్తిడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.