ఉరిశిక్ష పడుతుందని బెదిరింపులు
బాధితులను బెదిరిస్తున్న సీఎం సోదరుడు
గిరిజనులపై కొనసాగుతున్న అఘాయిత్యాలు
మండిపడ్డ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
బతికి ఉన్నవారి జీవనాధారం గుంజుకునే యత్నాలు
జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశాం
న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది
రాష్ట్రపతి ముర్మును కూడా కలిసి ఫిర్యాదు చేస్తాం
స్పష్టం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ: సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూములను ఆధారంగా చేసుకొని బతుకుతున్న వారి జీవనాధారాన్ని గుంజుకునే యత్నం చేశారని మండిపడ్డారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాలోతు కవితతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
అర్ధరాత్రి కరెంట్ తీసేసి..
తొమ్మిది నెలలుగా తమ భూములను ఫార్మాకి ఇవ్వబోమని లగచర్ల రైతులు చెబూతునే ఉన్నారని సత్యవతి రాథోడ్ అన్నారు. భూములు తీసుకుంటామంటే ఆవేశంలో కొంతమంది దాడి చేశారని చెప్పారు. దాన్ని సాకుగా చూపి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అర్ధరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్ నెట్ బంద్ చేసి మహిళలను హింసించారని.. కొట్టారని.. బూతులు తిట్టారని అన్నారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని.. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా పారిపోయారని చెప్పారు. మళ్లీ ఏం చేస్తారోనని ఇప్పటికీ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ధర్మ పోరాటానికి అండగా ఉండాలని రైతులు అన్ని పార్టీల నాయకులను కోరినట్టు సత్యవతి తెలిపారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ పోలీసులు గ్రామంలోకి వచ్చి అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఉరిశిక్ష పడుతుందని బెదిరింపులు..
కేసులో ఉన్నవారికి ఉరి శిక్ష పడుతుందని, భూములు ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ సోదరుడు బాధితులకు బెదిరిస్తున్నాడని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ భూములు గుంజుకుంటామని చెబుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీలో మాత్రమే న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడకు వచ్చామని తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్ను కలిసి పోలీసులు చేసిన అఘాయిత్యాలపై వివరించామని స్పష్టం చేశారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళ కమిషన్ను కూడా కలుస్తామని వెల్లడించారు. న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు.. రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డే అని.. ఆమె మాకు సమయం ఇస్తే వారికి కూడా ఈ ఘటనను వివరిస్తాని తెలిపారు. కొద్దిరోజులుగా బాధితుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని అన్నారు. లగచర్ల బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు.
గిరిజనుల భూముల జోలికి రావద్దు : మాలోతు కవిత
తండ్రుల వారసత్వంగా వచ్చిన భూములను ఫార్మా కంపెనీ ఇవ్వాలని అంటున్నారని మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం ఇప్పటికే భూములు సేకరించిందని.. దాన్ని కాదని గిరిజనుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడని మండిపడ్డారు. కానీ లగచర్లలో మా తండా వాసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 90శాతం లంబాడాలు మద్దతు ఇస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. మా గిరిజనుల భూముల జోలికి రావద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లగచర్ల బాధితులకు గిరిజన బిడ్డలందరం అండగా ఉంటామని చెప్పారు.