Saturday, November 23, 2024

నేడు రాజ్య‌స‌భ‌లో ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు – విప్ జారీ చేసిన బిఆర్ఎస్

ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానున్నది. బిల్లుపై చర్చించిన అనంతరం ఓటింగ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ విప్ జారీచేసింది. సోమ, మంగళవారాల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఎంపీ సంతోష్‌ కుమార్ స్పష్టం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ అధికారాలను ఎల్జీకి కట్టబెట్టడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పటికే లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన విషయం తెలిసిందే.

కాగా, మణిపూర్ ఘటనలపై రాజ్యసభలో చర్చించాల్సిందేనని బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టుబడుతున్నది. పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ రాజ్యసభ చైర్మన్‌కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 267 నిబంధన కింద మణిపూర్‌ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని, సాధారణ పరిస్థితులు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement