Friday, November 22, 2024

ADB: టీచర్ల పదోన్నతుల బదిలీ ఉత్తర్వుల జాప్యం.. ఉపాధ్యాయుల నిరసన

ఆంధ్రప్రభ బ్యూరో ఆదిలాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీ ఉత్తర్వులపై విద్యాశాఖ ఎడతెగని జాప్యం చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ డీఈవో కార్యాలయం ఎదుట భాషా పండితులు నిరసన చేపట్టారు. తప్పులు తడకగా జాబితాలు రూపొందించి ఆ తర్వాత సరిదిద్దామని ప్రకటన జారీ చేసి, మూడు రోజులైనా ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయుల చేతికి ఇంతవరకు ఉత్తర్వులు రాకపోవడంపై టీచర్లు అసహనం వ్యక్తం చేశారు.

పదోన్నతి కోసం జిల్లాలో 110 మంది భాషా పండితులు గంటల తరబడి వేచి చూస్తున్నారని, అధికారుల నుండి స్పష్టమైన సమాధానం రావడం లేదని భాషా పండితుల సంఘం నాయకులు వాపోయారు. అనంతరం డీఈఓ ప్రణీతను కలిసి పరిస్థితి వివరించగా.. డీఈవో విద్యాశాఖ ఆర్జెడి లింగయ్యతో మాట్లాడి పదోన్నతుల ఉత్తర్వుల గురించి వివరించారు. ఈరోజు ఎలాగైనా తప్పనిసరిగా ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో భాషా పండితులు వెనుదిరిగారు.


బయో సైన్స్.. సోషల్ కేటగిరి ఎస్ జి టి లకు పదోన్నతి..
స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్న బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఎస్ జి టి ఉపాధ్యాయులకు గురువారం పదోన్నతి ఉత్తర్వులు జారీ చేశారు. బయోసైన్స్ విభాగంలో 27 మంది, సోషల్ స్టడీస్ కేటగిరిలో 44 మందికి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయగా వారంతా కేటాయించిన స్కూల్లలో చేరిపోయారు.

- Advertisement -


ఎస్ జి టి బదిలీలకు దరఖాస్తులు..
పదోన్నతుల ప్రక్రియ చివరి అంకానికి చేరుకోగా .. మరోవైపు ఎస్ జి టి ఉపాధ్యాయుల బదిలీలపై గురువారం ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. 2024 జూన్ 1వ తేదీ వరకు ఒకే పాఠశాలలో 8 సంవత్సరాలు సర్వీస్ నిండిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని డిఇఓ ప్రణీత పేర్కొన్నారు. ఈ మేరకు బదిలీల కోసం టీచర్ల నుండి డీఈవో కార్యాలయంలో లిఖితపూర్వక దరఖాస్తులు స్వీకరించారు. ఖాళీలను బట్టి వీరిని భర్తీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement